ప్రేమ..పెళ్లి..విషాదం

సనత్‌నగర్‌: మనసారా ప్రేమించింది...తల్లిదండ్రులను కూడా ఎదిరించి కోరుకున్న వాడినే వరించింది. ఎక్కడున్నా తమ కూతురు సుఖంగా ఉంటుందని అనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశ అడియాసే అయ్యింది. పెళ్లయిన రెండు వారాలకే పరలోకాలకు చేరింది. హత్య చేశారా..? ఆత్మహత్య చేసుకుందా...? తెలియదుగానీ ఆమె తలపై గాయాలు ఉండడంతో తమ కూతురిని...అల్లుడే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ  తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టుగా కేసు నమోదు చేశారు. ఈ ఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. బోరబండ సమీపంలోని పాండురంగ నగర్‌కు చెందిన అల్లూరి ప్రసాద్‌కు కూకట్‌పల్లిలో రిబ్బర్‌ ప్రొడక్టస్‌ పరిశ్రమ ఉంది. ఇందులో పాండురంగ నగర్‌ సమీపంలో రామారావునగర్‌కు చెందిన దాసరి కార్తీక్‌ పనిచేసేవాడు. ఈ క్రమంలోనే బీటెక్‌ పూర్తిచేసి టెక్‌ మహేంద్రలో  ఉద్యోగం చేస్తున్న ప్రసాద్‌ కుమార్తె పూర్ణిమ అన్నపూర్ణతో కార్తీక్‌కు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా ఇద్దరూ చనువుగా ఉండేవారు. ఇది గమనించిన ప్రసాద్‌ కార్తీక్‌ను ఉద్యోగంలోంచి తొలగించాడు.